Take a fresh look at your lifestyle.

మిమీ చక్రవర్తికి చేదు అనుభవం

వేదికపైనే అవమానం.. పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నార్త్ 24 పరగణాల జిల్లా బొంగావ్‌లో ‘నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్’ ఆధ్వర్యంలో ఈ నెల 25 అర్ధరాత్రి సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకుల్లో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా వేదికపైకి వచ్చి కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టేజ్ దిగిపోయి వెళ్లాలని ఆదేశించారని మిమీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అర్ధరాత్రి వేళ మహిళా కళాకారిణిపై ఇలాంటి ప్రవర్తన అనుచితమని, దీనిని సహించరాదని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎక్స్‌లో ఆవేదన

ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్‌ (ట్విటర్) వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటామని, కానీ మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత లభించడం లేదని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.