Take a fresh look at your lifestyle.

వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వరదల నివారణకుప్రత్యేక నోడల్ ఏజెన్సీ
వరదల ఉధృతిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు
ఆధునిక పరిజ్ఞానంతో వరదలు అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు
ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాలతోనే వరదలు
2024 సెప్టెంబర్ లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం
ఖమ్మం జిల్లా మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులం ఆయిన ఖమ్మం జిల్లా
వరదల ఉధృతితో వేలాది ఎకరాల పంట నేలమట్టం,నెలకొరిగిన పశుపక్ష్యాదులు
కాలువల ఆక్రమణల తోటే పెరుగుతున్న వరదల ప్రవాహం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

వర్షాకాలంలో సంభవించే వరదల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా వరదల నివారణకు “నోడల్ ఏజెన్సీ” ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

బుధవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో కేంద్ర జలవనరుల సంఘం,కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ల ఆధ్వర్యంలో జరిగిన వరద మైదానాల జోనింగ్‌పై జరిగిన ప్రాంతీయ స్థాయి శిక్షణా శిబిరంలో మంత్రి మాట్లాడారు. వరదలతో సంభవిస్తున్న విపత్తులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించిందని వెల్లడించారు.

ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాలతో తరచుగా వరద విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2024 సెప్టెంబర్ లో సంభవించిన వరదల ఉదృతికి రాష్ట్రంలో భారీ నష్టం సంభవించిందన్నారు. కిందటేడాది మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం పట్టణంలోనీ పలు కాలనీలు అతలాకుతలం అయిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాటు పెద్ద ఎత్తున పంటపొలాలు నేలమట్టమై పశుపక్షాదులు విగత జీవులుగా మారిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. మున్నేరు నది ఉప్పొంగి 36 అడుగుల ఎత్తుకు నీరు చేరడంటి ఖమ్మం పట్టణం అతలాకుతలం అయిన విషయాన్ని ప్రస్తావించారు. అక్కడి కుటుంబాలు వారసత్వంగా నిర్మించుకున్న ఇండ్లు పై కప్పుల వరకు మునిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విపత్తుకు 110 కి పై చిలుక గ్రామాలు ముంపుకు గురి కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రక్షణార్థం కొండలు,గుట్టలు,ఇంటి పై కప్పుల మీదకు చేరి పడవల కోసం నిరీక్షించిన ఉదంతం తనను ఎంతో కలచి వేసిందన్నారు. ఆ వరదల విపత్తుకు 29 మంది మృత్యువాత పడ్డారని,5,438 కోట్ల నష్టం వాటిల్లడదతో పాటు 20 లక్షల ఎకరాల్లో పంట నీటిమట్టం పాలు అయిందని ఆయన గణాంకాలతో వివరించారు. దీనికి తోడు 1023 కిలోమీటర్ల దూరంలో రహదారులు 257 వాగులు ,చెరువులు దెబ్బతిన్నాయన్నారు.ఖమ్మం జిల్లాలో 30 ఏండ్లుగా ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. వర్షాకాలంలో భద్రాచలం సమీపంలోని గోదావరి నది ప్రమాదస్థాయి ని మించి వరద ఉధృతి రావడంతో భద్రాచలం-నెల్లిపాక రహదారి తెగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వరదల ప్రభావం 29 జిల్లాల పై పడిందన్నారు. చెరువులు,కుంటలు పొంగి పొర్లడంతో పాటు కట్టలు తెగి పడడంతో పంటలతో పాటు వేలాది కిలోమీటర్లు దూరం రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. ఇవి గణాంకాల కోసం చెప్పడం లేదని నష్టం వెనుక రాష్ట్రంలోని ప్రజల మనోవ్యధకు అద్దం పడుతోందని ఆయన తెలిపారు. భారీ వర్షాలు,తుఫాన్ లతో వచ్చే విపత్తుల కంటే కాలువల ఆక్రమణలతో ఈ తరహా విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. సహజసిద్ధంగా ప్రవహించే కాలువల ప్రవాహాన్ని ఆక్రమణల ద్వారా అడ్డుకోవడంతోటే తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరదల సమయంలో విపత్తులు పునరావృతం కాకుండా నిపుణులు తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఈ తరహా విపత్తుల నివారణకు శాస్త్రవేత్తలు ఏ.ఐ,జి. ఐ. ఎస్ ల వంటి ఆధునిక పరిజ్ఞానంతో సురక్షిత మార్గాలు అన్వేషించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కేంద్ర జలసంఘం ప్రతినిధి మాధురీయా, పాటు కే. ఆర్.యం.బి చైర్మన్ బి.పి పాండే, జి. ఆర్.యం.బి చైర్మన్ బిస్వాస్,పోలవరం ప్రాజెక్ట్ మెంబర్ సెక్రటరీ యం.రఘురాం,లతో పాటు ప్రకృతి విపత్తుల నిర్వహానాదికారులు ఐ. ఐ. టి ,ఎన్.ఐ. టి లతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.