ముద్ర,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోళ్లు జరగాలనే ఉద్దేశంతో అవసరమైన ప్రతి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన “రైతు వారం ” కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని, వారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, లారీల ద్వారా రైస్ మిల్లులు, గోదాములకు తరలించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తోందని, కొందరు రైతులు ప్రైవేట్ మిల్లులకు ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. సన్న వడ్లకు ప్రభుత్వం అదనంగా బోనస్ అందజేస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారని తెలిపారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చిందన్నారు. రైతు భరోసా పెంపుతో పాటు బోనస్ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు రైతులకు అందించినట్లు చెప్పారు. రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి సుమారు 25 లక్షల రైతు కుటుంబాలకు లాభం చేకూర్చినట్లు పేర్కొన్నారు. గతంలో విడతల వారీగా ఇచ్చిన రుణమాఫీ వడ్డీకే సరిపోగా, ప్రస్తుతం ఒక్క విడతలోనే పూర్తి రుణమాఫీ అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ప్రత్యేకమన్నారు. ఒకేరకమైన పంటలు కాకుండా వాణిజ్య పంటలు కూడా రైతులు వేయాలని సూచించారు. ఈ పంటల ద్వారా అధిక రాబడి రైతులు పొందే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమానికి మరికొన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, అధికారులు రైతులు పాల్గొన్నారు.
……………………………………
మార్కెట్ పనులు సత్వరమే పూర్తి చేయాలి:
మహబూబ్‌నగర్ లో నిర్మాణంలో ఉన్న వెజ్ & నాన్ వెజ్ విక్రయించే మార్కెట్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మార్కెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.
…………………………………..
కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సర్పంచ్:
……………………………
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై హన్వాడ మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయినోని పల్లి గ్రామ సర్పంచ్ నర్సింహులు ప్రభుత్వ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది కాంగ్రెస్ వైపు వస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ అని, అది ఏ క్షణంలో అయినా మునిగిపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్,నాయినోనిపల్లి గ్రామ అధ్యక్షులు తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
……………………………….
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత :
………………………………
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్టు దయాకర్, అలాగే ఇటీవల విధి నిర్వహణలో మరణించిన సీనియర్ జర్నలిస్టు దాసరి నర్సింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరు జర్నలిస్టు కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల చొప్పున చెక్కులను పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరుపున ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులకు , వారి కుటుంబ సభ్యులకు ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత ఓపిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి రఘు, నాయకులు రమాకాంత్ రెడ్డి , సతీష్ కుమార్ తిరుపతయ్య, జనార్థన్, రాము, రఘు, సతీష్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.