Take a fresh look at your lifestyle.

బిజ్వార్ జెడ్పిహెచ్ఎస్ కు బస్సును విరాళంగా ఇచ్చిన ఆదిత్య పరాశ్రీ స్వామీజీ

 

ముద్ర, నారాయణపేట:

స్వామీజీని అభినందించిన జిల్లా కలెక్టర్

      
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ.40 లక్షల వ్యయం గల పాఠశాల బస్సును ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టర్ సిక్త పట్నాయక్ తో కలిసి స్వామీజీ పాఠశాల బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ…దూర ప్రాంత గ్రామాల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఈ రవాణా సౌకర్యం ద్వారా మండలంలోని కొత్తపల్లి, పాతపల్లి, మొగ్డుంపూర్ గ్రామాలకు చెందిన మొత్తం 63 మంది విద్యార్థులు ప్రత్యక్ష లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండేందుకు రవాణా సౌకర్యం కీలకమని తెలిపారు. ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మాట్లాడుతూ…తాను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. ఆ పాఠశాల పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతోనే ఈ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశానన్నారు. తాను చేసింది సేవ కాదని,బాధ్యత కర్తవ్యమన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఇంట్లో అన్ని పనులు చేసి పాఠశాలకు ఆలస్యంగా వచ్చేవాడిని, అలాంటిది పక్క ఊర్ల నుంచి విద్యార్థులు నడుచుకుంటూ రావడం సాహసమేనన్నారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయడం ధర్మం అని తెలిపారు. ప్రతిరోజూ విద్యార్థులు నడుచుకుంటూ ఆశ్రమం ముందు నుంచి పాఠశాలకు వెళ్తుండటం చూసి తనకు ఎంతో బాధ కలిగిందని, ఆ కష్టాన్ని తొలగించాలనే సంకల్పంతో ఈ ఉచిత బస్సు సేవను ప్రారంభించానని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమం చట్టాన్ని గౌరవిస్తూ నిర్వహించాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. దేశంలో ఉన్న స్వామీజీలు దేశానికి ధర్మానికి కట్టుబడి ఉంటారని ఆయన తెలిపారు. డీఈవో గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, తహాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు అంజయ్య, నర్సిములు, తిరుమలేష్, పాఠశాల హెచ్ఎం కిషోర్ కుమార్, తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ, నాయకులు శేర్ కృష్ణ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.