- ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి.
- ఉద్యమకారుల ఫోరం దీక్షా శిబిరంలో జెఎసి నాయకుల డిమాండ్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతి యుత దీక్షలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జెఎసి నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ లు సందర్శించారు. దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియ పరచారు. దీక్షా శిబిరంలో కూర్చొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమకారులకు చేస్తున్న అన్యాయాలను, ఉద్యమ ఆకాంక్షలను ఈ చర్చించారు. దీక్షా శిబిరం ను ఉద్దేశించి చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమకారులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఉద్యమం పేరుతో గద్దె నెక్కిన గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదన్నారు.ఉద్యమకారులను అండగా ఉంచుకొని గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేటికీ ఉద్యమ కారులను గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని కోరారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో పోరాటాలు చేశామని, ఉన్న ఉపాధిని పోగొట్టుకొని, భార్యా పిల్లలను సైతం వదిలి పెట్టీ రోడ్లెక్కి ఉద్యమాలు చేయడంతోనే తెలంగాణ సాధ్యం అయిందన్నారు. అలాంటి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు గానీ, తగు ప్రభుత్వ సాయం గానీ అందించక పోవడం శోషనీయం అన్నారు. గత ఏడాది చేపట్టిన ప్రజా పాలనలో ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం నేటికీ ఆ ఊసే ఎత్తక పోవడం బాధాకరం అన్నారు. ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇంటి స్థలాలు, గుర్తింపు కార్డుకు ఇవ్వాలని, ఆ స్థలాలలో ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేసి ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పదవులలో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని కోరారు. వెంటనే ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఈ డిమాండ్లతో పాటు తెలంగాణ ఉద్యమ కారుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన గుణ పాఠం చెప్పి తీరుతామని పేర్కొన్నారు.
