ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న బక్రీద్ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఎస్పీ జానకి షర్మిల తో కలిసి నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రార్థనా స్థలాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈద్గాల పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్లు అప్పాల గణేష్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు, హిందు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.