Take a fresh look at your lifestyle.

సర్కారు భూమి అన్యాక్రాంతం

  • హైకోర్టుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.
  • సర్కారు భూమి కబ్జాపై హైకోర్టులో పిల్​.
  • శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో 27.18 ఎకరాలు అన్యాక్రాంతం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగింది. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, మురళినాయక్‌‌ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఈ పిటీషన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.ఖాజాగూడలోని సర్వే నెం.119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని న్యాయవాది కోర్టుకు వివరించారు.సర్వే నెంబర్‌ని మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని ఎమ్మెల్యేలు ఆ పిల్‌లో పేర్కొన్నారు. 2023లో రంగారెడ్డి కలెక్టర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్థులు నిర్మిస్తున్నారని చెప్పారు.ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ న్యాయస్థానానికి వివరించారు.ఓ ప్రైవేట్ పాఠశాలకు 150మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు.దీంతో పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయా ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని కోరారు.పిటీషనర్​ తరుపు న్యాయవాది వాదనలు విన్న సీజే ధర్మాసనం..ఆ భూమికి సంబంధించి సీఎస్‌, ప్రతివాదులకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని పిటీషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.