ముద్ర కూకట్‌పల్లి:
భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ రెండూ రోజుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కూకట్‌పల్లి నియోజకవర్గ స్థాయి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, జమ్మూ కాశ్మీర్ విలీనం వంటి కీలక వాగ్దానాలను ప్రధాని మోదీ నెరవేర్చారని కొనియాడారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి అధ్యక్షులు కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. నిబద్ధతతో పనిచేసే వారికే కార్పొరేషన్ టికెట్లు దక్కుతాయని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మరియు కూకట్‌పల్లి ఇంచార్జ్ మాధవరం కాంతారావు, ఓ.ఎస్. రెడ్డి, పద్మయ్య, శ్రీకర్ రావు, మహేందర్, వినోద్ తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.