Take a fresh look at your lifestyle.

మోడీ హాయంలోనే రాష్ట్ర అభివృద్ధి

  • రాష్ట్రానికి తాజాగా మూడు కేంద్ర కొత్త సంస్థలు మంజూరు.
  • మిల్లెట్ ప్రాధాన్యతను పెంచేందుకు ఒప్పందాలు.
  • రూ. 250 కొట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్.
  • రైల్వే కోసం అత్యధిక నిధులు.
  • సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ.
  • మూడున్నరేండ్లలో ఐటీఐలు 47 శాతం వృద్ధి.
  • బీఆర్ఎస్‌లో అది డాడీ అండ్ డాటర్ అంతర్గత లేఖ.
  • దానికి ప్రాధాన్యత అవసరం లేదు.
  • అదో మునిగిపోయే నౌక.
  • నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
  • మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు.. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక కేంద్ర సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటి వివరాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని ఆయన చెప్పారు. తాజాగా తెలంగాణకు మూడు కేంద్ర సంస్థలు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధనా కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందన్నారు. రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన భారత నిర్మాణం కోసం 2023 మార్చి 18న ‘పీఎం శ్రీఅన్న’ పథకాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఐసీఏఆర్ పరిధిలోని ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.ఈ పరిశోధనలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు కొత్తగా ఏర్పడే గ్లోబల్ సెంటర్ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫామ్‌లు, ట్రైనింగ్ రూములు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయనున్నారని ఆయన చెప్పారు. అలాగే జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. మిల్లెట్స్ సాగు కోసం నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా తెలంగాణ రైతులకు అందించనున్నారని అన్నారు. ఐఐఎంఆర్ తో పాటు కొత్తగా ఏర్పడే ఈ కేంద్రం ద్వారా రైతులకు రెగ్యులర్ శిక్షణ, వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్‌కు సహకారం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభించనుందన్నారు.

  • సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం కానుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తాత్కాలికంగా ఈ కేంద్రానికి రూ. 41 కోట్లు, పూర్తి స్థాయి నిర్మాణానికి రూ. 274 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారుయ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కవచ్ టెక్నాలజీపై విస్తృత పరిశోధనలను ఈ కేంద్రం చేపట్టనుంది. రైల్వే పైలట్లు, టెక్నీషియన్లకు క్వాలిటీ శిక్షణ, విద్యాసంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతారన్నారు. కవచ్ టెక్నాలజీ అభివృద్ధికి చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు అనుమతులు, రీసెర్చ్, డిజైన్, స్పెసిఫికేషన్‌లను పర్యవేక్షించే విధంగా వ్యవస్థ అమలులోకి రానుందన్నారు.అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ గల దేశంగా నిలిచిందన్నారు.రైల్వే సిగ్నలింగ్ వంటి అంశాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ (గోరఖ్‌పూర్), ఎంబీఎం యూనివర్సిటీ (జోధ్‌పూర్) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని కిషన్ రెడ్డి చెప్పారు.

  • నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ అభివృద్ధి.

నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో వృత్తి విద్యకు సంబంధించి 1950 నుండి ఐటీఐలు పని చేస్తున్నాయన్నారు. ఈ కీలక విద్యా సంస్థల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత మూడున్నర సంవత్సరాల్లో 47% వృద్ధితో, దేశవ్యాప్తంగా ఐటీఐల సంఖ్య 14,600కి చేరుకుందని ఆయన చెప్పారు. ఇందులో 3,316 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా, ఇవి 681 జిల్లాల్లో పనిచేస్తున్నాయని అన్నారు. 2014లో ఐటీఐల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 9 లక్షలైతే, ప్రస్తుతం ఇది 14.4 లక్షలకు పెరిగిందన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐటీఐల అప్‌గ్రేడేషన్‌కు రూ. 60 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లూథియానా వంటి ఐదు నగరాల్లో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ కేంద్రాలు ‘ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్’ కార్యక్రమంతో పాటు, ఐటీఐలకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం పనిచేస్తాయన్నారు.

  • 2026 నాటికి 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి.

2026 నాటికి తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింది అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే మూడు రైల్వే స్టేషన్లు అధునీకరణ పూర్తి అయ్యి పునఃప్రారంభించామన్నారు. కొత్త రైళ్ల ప్రవేశం‌తో పాటు, రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోందన్నారు. అందుకు సాక్షిగా వరంగల్ రైల్వే స్టేషన్‌ను కాకతీయుల శైలిలో తీర్చిదిద్దామన్నారు.

  • 53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్ళ ఒప్పందం.

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేలా ఒప్పందం చేసుకుందన్నారు. 53 లక్షల టన్నులపై అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత ధాన్యం సేకరించినా, దానికి అవసరమైన పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా అదనపు భారం ఉండదని, ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు. గత కొన్నేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. అవసరమైతే అదనపు సెంటర్లు ఏర్పాటు చేసి చివరి ధాన్యపు గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత సేకరించినా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా రేవంత్ సర్కార్ ను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి, పరిశ్రమల నుంచి ‘ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నేను రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం తాను పనిచేయడం లేదన్నారు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనేది స్వతంత్ర సంస్థ అని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు చట్టబద్ధంగా జరుగుతోందని అన్నారు.

  • డాడీ – డాటర్ మధ్య అంతర్గత లేఖకు ప్రాధాన్యత లేదు.

బీఆర్ఎస్‌లో డాడీ – డాటర్ మధ్య అంతర్గత లేఖ పై ప్రాధాన్యత ఇవ్వల్సిన అవసరం లేదన్నారు. మునుగుతోన్న నావ లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు సహజమని కిషన్ రెడ్డి కొట్టపారేశారు. బీఆర్‌ఎస్ పార్టీ డాడీ–డాటర్–సన్ పార్టీ. ఇది నాలుగు స్తంభాల ఆటలాంటిదన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదన్నారు. కవిత రాసిన లేఖలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు ఆమె చెప్పిందని, అయితే ప్రజలు అనుకోవడం కాదు.. బీజేపీయే ప్రత్యాత్నాయమని ప్రజలు నమ్ముతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.