జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల తనిఖీ
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో బాలికల హాజరు శాతం,మధ్యాహ్నం భోజన పథకం అమలు, విద్యార్థినులకు అందుతున్న విద్య బోధన తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, పనిచేసే ఉపాధ్యాయుల హాజరు ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా నమోదు చేయాలని,హాజరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులు త్వరగా జనరేట్ చేసి చెల్లింపులు జరిపేందుకు కూడా ఎఫ్.ఆర్.ఎస్ హాజరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలని, ప్రతి విద్యార్థిని పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠ్యాంశాలు విద్యార్థినులకు అర్థమయ్యే విధంగా బోధన జరగాలని అన్నారు.10వ తరగతి పాఠశాల విద్యార్థినిలు మంచి మార్కులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి,ఎంఈఓ సురేందర్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.