స్వర్ణ గిరిలో శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం… శ్రీ పద్మావతి అమ్మవారికి నవకలశ పంచామృత అభిషేకం…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి ఉదయం పాలు పెరుగు తేనె చక్కర పండ్ల రసాలు పసుపు కుంకుమ చందనాదులతో నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.