మహదేవపూర్ ముద్ర:
జయశంకర్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ సతీష్‌ను కలెక్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మొత్తం 227 మంది విద్యార్థులకు గాను ఒకరు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థిని కీర్తనను గమనించిన కలెక్టర్ సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అనంతరం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడి సౌకర్యాలను సమీక్షించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అలాగే మైనర్ ఆపరేషన్ థియేటర్‌కు అవసరమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.