Take a fresh look at your lifestyle.

మా సంకల్పానికి సహకరించండి – వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్​ రెడ్డి

  • ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం
  • తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఫ్యూచర్​ సిటీ
  • హైదరాబాద్ ను పర్యావరణహితంగా తీర్చిదిద్దుతాం
  • ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు ఉండేలా చర్యలు
  • వేర్ హౌజ్ హబ్ గా డ్రైపోర్టు నిర్మాణం
  • మచిలీపట్నం పోర్టుకు రోడ్డు,రైల్వే మార్గాలతో అనుసంధానం
  • 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్ల నిర్మాణం

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఙప్తి చేశారు. దావోస్​ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి బుధవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం,కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ,హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు.

తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అన్న సీఎం..అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుతామని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామనీ పర్యావరణహితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది తమ అభిమతమన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నామన్న రేవంత్​ రెడ్డి అందుకు ఎలక్టిక్ వెహికిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశామన్నారు. తెలంగాణలో ​దేశంలోనే ఎక్కువ ఈవీ వాహనాలు అమ్ముడుపోతున్నాయని చెప్పారు. మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదనీ ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో మూడు వేల ఎలక్ట్రిక్​ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.

‘డ్రైపోర్టు’తో రూపు రేఖలు మారుస్తాం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామని వివరించారు. నగరాల అభివృద్ధికి,వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీ భవిష్యత్తుకు పునాది అన్నారు. తక్కువ ఖర్చు,తక్కువ సమయంలో చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉందన్న సీఎం దాదాపు వంద కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న దానికంటే ఇది రెండింతలు ఎక్కువ అన్నారు. తాను తన బృందంతో కలిసి జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైలులో ప్రయాణించానన్న రేవంత్​ రెడ్డి అదొక అందమైన అనుభూతిని కలిగించే ప్రయాణమని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ఉందనీ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. ఆ రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తామని చెప్పారు. రింగ్ రోడ్లకు అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించాలనే ఆలోచనలున్నాయని సీఎం వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.