-అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం – వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినందుకు గాను ‘జగత్ జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్’ కు మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నెపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 267/ఆ, 267/E లలో ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే ఫంక్షన్ హాల్ కోసం టిన్ షెడ్, కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బిచ్చమ్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్లు 174, 178, 181 286 కింద ఈ నోటీసు జారీ చేశారు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కమిషనర్ ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎందుకు నిర్మాణాలు చేపట్టారో వారం రోజుల్లో వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వని పక్షంలో, సదరు అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బందితో తొలగిస్తామని, దానికి అయ్యే ఖర్చును కూడా సదరు సంస్థ నుంచే వసూలు చేస్తామని నోటీసులో హెచ్చరించారు.
TS-bPASS నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తెలియజేశారు.