కోల్ మైన్స్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్ పెరిగే వరకు పోరాడుతా. లోక్ సభ జీరో అవర్ లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: దేశ వ్యాప్తంగా సింగరేణితో పాటు కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు గనుల్లో సుధీర్ఘ కాలం కష్టించి పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల కు చాలీచాలని ఫించన్ అందిస్తున్నారని,వారికి ఫించన్ పెంపుదల చేసే వరకు పోరాడు తానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. బొగ్గు గని కార్మికులకు వస్తున్న తక్కువ ఫించన్ ను పెంచాలని కోరుతూ లోక్ సభలో జీరో అవర్ లో ఈ అంశాన్ని ఎంపీ అత్యవసర సమస్యగా ప్రస్తావన కు తీసుకువచ్చారు.1989లో అప్పటి కేంద్ర మంత్రి, కాకా వెంకట స్వామి బొగ్గు గని కార్మికులకు ఫించన్ సౌకర్యాన్ని తీసుకు వచ్చారని,అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఫించన్ పెంపుదల చేయాలని నిబంధనలున్నా వాటి గురించి పట్టించుకోవడం లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే స్పందిస్తూ బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఫించన్ స్కీమ్ ను ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్ష చేయాలని నిబంధనలున్నాయని అంగీకరించారు. అయితే 1989లో ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఫించన్ సవరణ జరగలేదని స్పష్టం చేశారు. కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు 2031–32 నాటికి రూ.47,961 కోట్ల లోటు ఉండబోతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ ఫించన్ లోటు సమస్యను పరిష్కరించడానికి,రిటైర్డ్ కార్మికులకు న్యాయమైన ఫించన్ అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.సింగరేణి అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన రిటైర్డ్ ఉద్యోగుల కు న్యాయం జరిగే వరకు విశ్రమించకుండా పోరాడుతానని ఎంపీ తెలిపారు.