ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు.

ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గోవింద నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ గావించారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు మంచి నీరు మజ్జిగ అందించి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి
వారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం స్వామివారి రథోత్సవ సేవ ఆదిమధ్యాంతరహితుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో రధం పై శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి రథోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.