Take a fresh look at your lifestyle.

రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి..కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్

గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేయాలి..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రైతుబజార్ ఎదురుగా నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజకులపై దాడి చేసి, పసిపాపను హత్య చేసిన అగ్రకుల పెత్తందారుల దిష్టిబొమ్మను దహనం వెంకటేష్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో గత బుధవారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలోకి ప్రవేశించగా టికెట్టు లేకుండా గుడిలోపలకి రావద్దు అని రజకులపై దాడి చేసి పెత్తందారు శ్రీనివాసరెడ్డి కీర్తి రెండు నెలల బిడ్డను కాళ్లతో తన్ని చంపేశారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన కేసు నమోదు చేయకుండా బాధితులపైనే తిరిగి కేసు నమోదు చేశారని అగ్రకులాల పెత్తందారులకు పోలీసులు వత్తాసు పలకడం సరైనది కాదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదని, పసిపాప హత్యకు కారణమైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రజకులపై దాడులను ఇలాంటి అరాచకాలను ఆపేందుకు రజకులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు నెమలి కరుణాకర్, ఐతరాజ కిష్టయ్య, సంఘం మండల నాయకులు ముదిగొండ నరేష్, మరిపెళ్లి కిష్టయ్య, వడ్డెబోయిన స్వప్న,ఎల్లంల అనుష, కంబాలపల్లి యాదయ్య, మరిపెళ్లి రాములు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.