- రాష్ట్రానికి మల్టీనేషన్ కంపెనీల క్యూ
- హైదరాబాద్ లో హెచ్‌సీఎల్ కొత్త టెక్ సెంటర్
- ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
- మెఘా తో మూడు కీలక ఒప్పందాలు
- మరో ఏడు దిగ్గజ కంపెనీలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు కీలక మల్టీనేషన్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. 2007 నుంచే హెచ్‌సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది.కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్ సీఎల్ మొత్తం ఐదు సెంటర్లను విస్తరించనుంది.హెచ్‌సీఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ అందుకుంది. దాంతో సుమారు 5వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ రైజింగ్ టీం ప్రకటించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్‌సీఎల్ గ్లోబల్ నెట్ వర్క్ సెంటర్ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని ఆహ్వానించారు. స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్‌సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు.
రూ. 10వేల కోట్లతో ఏఐ క్లస్టర్
తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.ఈ మేరకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 400మెగా వాట్ల సామర్థ్యంతో అర్టిఫిషియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్ట్ తో దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది. ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చల అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందనీఐటీ సేవల సామర్థ్యం పెరుగుఉందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అభిప్రాయపడ్డారు. కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని చెప్పారు.
ఏడు దిగ్గజ కంపెనీలతో చర్చలు
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బుధవారం విప్రో, సన్ పెట్రో కెమికల్స్, జేఎస్ డబ్ల్యు గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టిల్ మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్ వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. అనంతరం బిల్డింగ్ రీజనరేటివ్ అండ్ సర్క్యులర్ ప్లేసేస్ ధీమ్ తో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొననున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
‘మెఘా’ మూడు కీలక ఒప్పందాలు..
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ చర్చల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మెఘా కంపెనీ అధినేత ప్రకటించారు. దాంతో పాటు మెఘా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూపై సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో100 ఎంవీహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది.దీనికి రూ.3వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో రెండేండ్లలో వెయ్యి మందికి ప్రతక్ష్య ఉద్యోగాలు,3వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.ఇంధన నిల్వ,గ్రిడ్ స్థిరత్వం,పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు మెఘా ముందుకొచ్చింది.అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేసేందుకు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్న మెఘా ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది.