Take a fresh look at your lifestyle.

పేద ప్రజల పై దౌర్జన్యం చేస్తే సహించం – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

  • గుండాలు, భూ అక్రమార్కుల భరతం పడతాం
  • ఇంకా ఇబ్బంది పెడితే చీల్చి చెండాడుతాం
  • హైదరాబాద్ లో గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం ఉంది
  • పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు?

ముద్ర, తెలంగాణ బ్యూరో : పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తే సహించబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. పేదల ఇండ్ల స్థలాలను ఆక్రమించుకుంటున్న గుండాలు, భూ ఆక్రమార్కుల భరతం పడతామన్నారు. ఇంకా ఇబ్బంది పెడితే చీల్చి చెండాడుతామన్నారు. మేడ్చెల్ జిల్లా ఏకశిలానగర్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై చేయజేసుకున్న ఘటనకు సంబంధించి ఎంపీ ఈటలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బుధవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. హైదరాబాద్ నగర ప్రజలపై హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రతి రోజు తన కార్యాలయానికి వేల సంఖ్యలో ప్రజలు ఇచ్చి తమ ఇళ్లను అక్రమంగా కూలగొడుతున్నారని, కాపాడాలని ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. పలువురు బిల్డర్లు, గుండాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే సమస్యలపై తాము పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారని అన్నారు. దీంతో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో చివరి ప్రయత్నంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు విన్నవించినట్లు తెలిపారు. కనీసం రాచకొండ పోలీస్ కమిషనర్ కు కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిష్కారం చూపలేదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో బాధితులకు న్యాయం చేసేందుకు బీజేపీ పార్టీగా తాము అండగా నిలిచామన్నారు. మేడ్చల్ లోని ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో సర్వే నంబర్ 739 నుండి 749 వరకు 149 ఎకరాల భూమి ఉందని తెలిపారు. 1985లో న ఏకశిల నగర్ కాలనీ పేరుతో గ్రామపంచాయితీ అనుమతితో 2086 ప్లాట్లను లే-అవుట్ చేశారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు 2076 మంది 200 గజాల చొప్పున ప్లాట్లను కొనుగోలు చేశారని ఎంపీ ఈటల వివరించారు. 2005లో ఓనర్లే 47.25 ఎకరాల భూమిని ఎం. రాజు, ఎ. వెంకటేశ్, ఎ. విజభాస్కర్ పేరుమీద సేల్ డీడ్ చేశారన్నారు. 1985 నుంచి 2005 వరకు ఈ భూముల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 2006లో ఈ ముగ్గురు భూమిని కొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. పంచాయతీరాజ్ డీపీఓను మేనేజ్ చేసి అవి ప్లాట్లు కాదని అగ్రికల్చర్ ల్యాండ్ గా నమోదు చేయించారన్నారు. ఈ ప్రొసీడింగ్స్ కి వ్యతిరేకంగా కోర్టులో బాధితులు కేసు వేశారని, 2010 లో అది అగ్రికల్చర్ భూమి కాదంటూ తీర్పునిచ్చిందన్నారు. హర్ష కన్ స్ట్రక్షన్ సంస్థ ఈ లే-అవుట్ లో 206 ప్లాట్లు కొనుగోలు చేసిందని, మళ్లీ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో 47 ఎకరాలకు మ్యుటేషన్ సంపాదించారని ఎంపీ ఈటల ఆరోపించారు. రియల్టర్లు, గూండాల దౌర్జన్యం గురించి ఓ మహిళ తమ దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారని ఈటల తెలిపారు. దాంతో ఫీల్డ్ కి బాధితులతో కలిసి వెళ్లామన్నారు.

ఆ గూండాలు కనీసం వెనక్కితగ్గకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని, అందుకే ఆ గూండాలపై తనలాంటి వారు చేయి ఎత్తాల్సి వచ్చిందని ఎంపీ ఈటల చెప్పారు. గతంలో బాలాజీ నగర్, జవహర్ నగర్ లోలో కట్టుకున్న ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే బాధితల పక్షాన బీజేపీ నిలబడి కాపాడిందని తెలిపారు. ఇప్పుడు అవే ప్రాంతాల్లో మళ్లీ హైడ్రా పేరుతో కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేస్తుంటే, అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. మూసీనది ప్రక్షాళన జరగాలంటే మూసీకి ఇరువైపులా 300 మీటర్లలో ఇండ్లన్నీ కూలగొట్టి భూములు గుంజుకొని మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించాల్సిన అవసరం లేదన్నారు. మూసీకి రెండు దిక్కులా ఇండ్లు కూల్చే సమయంలో బీజేపీ ఎంపీగా పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడ్డమని ఈటల రాజేందర్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.