ముద్ర: కాప్రా
తెలుగు సినిమా రంగానికి మరో తీరని లోటు ఏర్పడింది. సుమారు 350కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సినీ నటుడు కాలకోట రఘునాథ రెడ్డి నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
కాప్రా డివిజన్ పరిధిలోని ప్రథమపురి కాలనీలో నివసిస్తున్న రఘునాథ రెడ్డి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల క్రితం ఆయన కన్న కొడుకు కూడా గుండెపోటుతో మృతి చెందగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక అదే బెంగతో రఘునాథ రెడ్డి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
రఘునాథ రెడ్డి తన సినీ ప్రయాణంలో కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించారు.
ఈ విషయం తెలుసుకున్న సినీ నటి శివపార్వతి రఘునాథ రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఇంత పెద్ద కళాకారుడిని తెలుగు సినిమా ఇండస్ట్రీ సరైన విధంగా పట్టించుకోకపోవడం మా దురదృష్టకరం” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రఘునాథ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.