ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి పునః ప్రతిష్ఠకు 26 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం మూడో రోజు ప్రత్యేక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య సాగాయి.
ఈ సందర్భంగా మండల ఎస్‌ఐ శ్రీనివాస్ దంపతులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమూర్తులైన అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతం నిర్వహణతో సకాలంలో వర్షాలు కురిసి పంటల సమృద్ధి, ప్రకృతి విపత్తుల నివారణ, భక్తుల కోరికల సాధన, అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని అర్చకులు వివరించారు.
అలాగే ఉమామహేశ్వర స్వామి, పరమశివుడు, వినాయక స్వాములకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా రుద్ర హోమం, దుర్గా హోమం, శాంతి హోమాలు నిర్వహించగా, ఎస్‌ఐ శ్రీనివాస్–నిరోషా దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాలరావు, ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి, సర్పంచ్ సుగుణమ్మ, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, వీరశేఖరాచారి, పుల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధంశెట్టి నరేష్ శెట్టి, కేంచే రాజేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.