- అరకొరగా ఏర్పాట్లు.
- కలెక్టర్ రాకతో కోనేరు శుభ్రత.
- త్రాగునీరు లేక భక్తుల అవస్థలు.
మల్యాల, ముద్ర : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ కు ఉదయం అభిషేకం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు పాదయాత్రగా తరలివచ్చి, కల్యాణకట్ట భవనంలో దీక్ష విరమించి, కోనేరులో పుణ్య స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు. భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యంగా ఘాట్ రోడ్డుపై ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జయంతి ఉత్సవాలు నత్త నడకన సాగడంతో భక్తులు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనేరు మురికి నీరు ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు కనీసం నీటి త్రాగునీరు సౌకర్యం, పాదయాత్రగా వచ్చే భక్తులకు నీటి సౌకర్యం అరకొరగా ఏర్పాటు చేశారు. 20 లక్షల లీటర్ల వాటర్ స్టోరేజ్ ఉన్నప్పటికీ కోనేరు లో నీరు నింపకపోవడం అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నవి. కలెక్టర్ పర్యవేక్షణకు వస్తున్నాడని సమాచారంతో హుటాహుటిన కోనేరులో వాటర్ నింపారు. కొండగట్టు ఆలయానికి ప్రతి ఏటా వచ్చే భక్తులు డెవలప్మెంట్ లేకపోవడం పై ఇప్పటికైనా వసతి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
