- అలాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని పూజిద్దాం.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పేద, పీడిత ప్రజలకు అండగా ఉన్న సమాజ ఉద్దారకుడు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప వ్యక్తి అని, అలాంటి గొప్ప వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని పూజించుకుందామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అణగారిన జాతుల హక్కుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు జ్యోతిభా పూలే, సావిత్రిభా పూలే అని ఆయన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం పూలే 198 జయంతి సందర్భంగా సికింద్రాబాద్ సైనికపురి చౌరస్తాలో పూలే విగ్రహానికి ఎంపీ ఈటల పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి, జై పూలే అంటూ నినాదించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ఎంతటి అణచివేత ఉన్నప్పటికీ ఆనాడు దుర్మార్గానికి వ్యతిరేకంగా బరి గీసి కొట్లాడిన మహనీయుడు పూలే అని అన్నారు. దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా పూలే అని, స్వయంగా సావిత్రి పూలే ఆ స్కూల్‌ను నడిపారని ఎంపీ ఈటల వివరించారు. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడం కోసం కృషి చేసిన పూలే జయంతి ఉత్సవాలను రాజకీయలకు అతీతంగా జరుపుకోవడం సంతోషకమన్నారు.తన గురువు పూలే అని ఆనాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ప్రకటించారని తెలిపారు.అంటే పూలే గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చని, అంబేద్కర్ కంటే ముందే అనేక అంశాలమీద కొట్లాడిన మహనీయుడు పూలే అని ఎంపీ ఈటల వెల్లడించారు.
