ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నవజాత శిశు ఆరోగ్య సేవలందించడంలో ప్రతిభ కనబర్చిన నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తోట ఉషారాణికి, అలాగే ఇటీవల పదోన్నతి పొందిన హెడ్ నర్స్ కృష్ణవేణికి నర్సింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా ఎంపికైన ప్రముఖ పీడియాట్రిక్ విభాగానికి చెందిన 8 మంది వైద్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఉషారాణి, కలకత్తాలో జరిగిన నియోకాన్ ఫెలోషిప్ 44వ వార్షికోత్సవ జాతీయ సదస్సులో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను శాలువాతో సత్కరించారు.
అదేవిధంగా పదోన్నతి పొందిన హెడ్ నర్స్ కృష్ణవేణిని కూడా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సర్జికల్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. రఘు, ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ. రోహిత్, నర్సింగ్ సూపరింటెండెంట్లు మంజుల, పెర్సీ సుమన్, హెడ్ నర్సులు అమృత, పద్మ, నర్సింగ్ ఆఫీసర్ల జిల్లా అధ్యక్షురాలు జానకి దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. ఆనంద్, నర్సింగ్ అధికారులు సరస్వతి, అనురాధ, సునీత, కేశవ్, అంజి తదితరులు పాల్గొన్నారు.