Take a fresh look at your lifestyle.

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు : తీర్థయాత్రలకు ఐఆర్.సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

 

హైదరాబాద్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21 వరకు నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన యాత్రల వివరాలను వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు

మొదటి ప్యాకేజీగా దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగంతో మార్చి 21 నుంచి 28 వరకు జరుగుతుంది. తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి పవిత్ర ప్రాంతాలను ఈ యాత్రలో సందర్శిస్తారు. టికెట్ ధరలు సాధారణ క్లాస్‌కు రూ.14,700, 3 ఏసీకి రూ.22,300, 2 ఏసీకి రూ.28,700గా నిర్ణయించారు.

రెండవ ప్యాకేజీ సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 14 నుంచి 24 వరకు ఉంటుంది. ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్ వంటి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ ధరలు రూ.17,600 నుంచి రూ.34,600 వరకు ఉన్నాయి.

మూడవ ప్యాకేజీ అయోధ్య-కాశీ-బైద్యనాథ్ ధామ్ యాత్ర ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు కొనసాగుతుంది. పూరి, కోణార్క్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే ఈ యాత్రకు రూ.16,700 నుంచి రూ.34,100 వరకు చార్జీలు ఉంటాయి.

నాలుగవ ప్యాకేజీగా హరిద్వార్-మాతా వైష్ణోదేవి-రిషికేశ్ యాత్ర మే 12 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. మధుర, బృందావనం, వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలు ఇందులో భాగం. టికెట్ ధరలు రూ.16,500 నుంచి రూ.33,400 వరకు ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

ఈ ప్యాకేజీల్లో రైలు, బస్సు, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, వాటర్ బాటిల్, టూర్ ఎస్కార్ట్ సేవలు అందిస్తారు. అదనపు ఖర్చు లేకుండా దర్శనాలు, ప్రయాణ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి రైలులో సుమారు 705 మంది ప్రయాణికులు ఉండగా, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు సేవలు అందిస్తారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు.

ఎయిర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో

హైదరాబాద్ నుంచి దేశీయంగా ఒడిశా (5 రోజులు), హిమాచల్ & పంజాబ్ (7 రోజులు), కర్ణాటక (6 రోజులు), అయోధ్య-కాశీ (7 రోజులు), అండమాన్ నికోబార్ (6 రోజులు), కాశ్మీర్ (6 రోజులు) వంటి ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా నేపాల్ (7 రోజులు), శ్రీలంక (6 రోజులు) టూర్ ప్యాకేజీలు ప్రకటించారు.

బుకింగ్ వివరాలు

టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు 9701360701, 9281030727, 9281030759 నంబర్లను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు www.irctctourism.com
వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో IRCTC టూరిజం మానిటర్స్ ప్రశాంత్, శ్రీకాంత్, ట్రావెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.