Take a fresh look at your lifestyle.

జీవన్ రెడ్డి విమర్శలను జనం పట్టించుకోరు-మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

 
సీఎం రేవంత్ పోవాలని చెప్పడానికి ఆయన ఎవరూ..?
ముందు గతంలో బీఆర్ఎస్‍పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ జీవన్ రెడ్డికి 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది
పొంగులేటిపై నిరాధార ఆరోపణలు వద్దు
ఆధారాలు తీసుకొస్తే గాంధీభవన్ లో చర్చకు సిద్ధం
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేస్తోన్న విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్తితిలో లేరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్‍ ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్‍పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. గురువారం గాంధీ భవన్‍లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా మించిదేమీ లేదన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి పునరాలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదన్న ఆయన ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరు బాగుపడ్డది లేదని మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పోయిందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదనీ వాటికి సంబంధించి హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. పొంగులేటిపై వచ్చిన భూ కబ్జా, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని బీఆర్ఎస్ నేతలకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత పొంగులేటి విషయంలో కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. పొంగులేటి పై విమర్శలు చేయడం కాదు ఆధారాలు ఉంటే గాంధీ భవన్‍కు వచ్చి ఇవ్వాలన్నారు. ఆధారాలు తీసుకొని వస్తే తాను చర్చకు సిద్ధం అన్నారు. నాదర్‍గుల్ భూముల కుంభకోణం బీఆర్ఎస్ హయంలోనే జరిగిందని ఆరోపించారు. తమ పార్టీ నాయకుల మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మేము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని అదే మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందన్నారు.

ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు:
మంత్రివర్గ విస్తరణ సీఎం పరిధిలోని అంశం అని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. తనకున్న సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణలో ఇప్పట్లో ఉండదన్నారు. తాము అంతా కూడా ఎన్ఎస్‍యూఐ నుంచి వచ్చిన వాళ్ళమేనన్నారు. అందుకే నేడు ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ అనిల్‍కుమార్ యాదవ్ , ఎస్సీ సెల్ చైర్మన్ శంకర్ నాయక్ అందరం అక్కడ నుంచి వచ్చిన వాళ్లమేనన్నారు. ఎన్ఎస్‍యూఐ నాయకత్వాన్ని అందిస్తున్న ఒక కంపెనీ లాంటిదన్నారు. ఆ సంస్థ నుంచి మంచి అవకాశాలు వచ్చాయన్నారు. తాము అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేనన్నారు. ఎన్ఎస్‍యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి నేతృత్వంలో మరింత బలోపేతంగా ముందుకు సాగాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.