ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరియు APPC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాం ప్రసాద్ లాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సత్యసాయి దేవాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు.
APPC అధ్యక్షులు జహంగీర్ పాషా, కార్యదర్శి అజారుద్దీన్ తెలిపారు నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మరియు అచ్చంపేట మెప్మా పరిధిలోని మహిళా సంఘ సభ్యులకు ఏప్రిల్ 9, 2026 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు రెండు బ్యాచ్‌లలో ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ కుట్టుటపై శిక్షణ అందించబడుతుందని చెప్పారు.
ఈ శిక్షణను ట్రైనర్లు సావిత్రి మరియు ఎం. నాగయ్య గౌడ్ నిర్వహించనున్నారు. మహిళా సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎంసీ ఎం. శ్వేత, టీఎంసీ పి. శంకర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.