అమరావతి , జనవరి 2 : భవననిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ విషయంలో వారంరోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు.గురువారం తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర నాయకత్వ బృందానికి మంత్రి సుభాష్ ఆమేరకు హామీ ఇచ్చారు.భవననిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును తక్షణం పునరుద్ధరించి , పెండింగులో ఉన్న వేలాది క్లెయిములను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ భవననిర్మాణ కార్మికసంఘం నాయకులు గురువారం సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో మంత్రిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ విషయమై రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది భవననిర్మాణ కార్మికులు ప్రభుత్వం వంక ఆతృతగా ఎదురుచూస్తున్నారని యూనియన్ నాయకులు మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన యూనియన్ బృందంలో యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.వెంకట సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ (బుజ్జి) , ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సోనా రాజు ఉన్నారు.
ఒకే లబ్ధిదారుడు వేర్వేరు పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి ఐఎఎస్ అధికారులతో త్వరలో కమిటీ వేస్తామని గతంలో మంత్రి ఇచ్చిన హామీని యూనియన్ నాయకులు ఆయనకు గుర్తు చేశారు.దానికి మంత్రి వాసంసెట్టి సుభాష్ స్పందిస్తూ ఈ విషయమై కార్మికశాఖ కార్యదర్శితో మాట్లాడి ఈనెల ఎనిమిదో తేదీన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.”భవననిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని” కూడా మంత్రి స్పష్టం చేశారు.