- ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలనేది వచ్చే నెలలో చెబుతాం
- లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి
- అర్హులను గుర్తించేందుకు కొంత ఆలస్యం
- ఇప్పుడు మండలానికి ఒక గ్రామం ఫైలట్ ప్రాజెక్టు
- సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటీ ప్రెస్ మీట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలను నేటి నుంచి అమలు చేయబోతున్నామని తెలిపారు.
అయితే వాటి కోసం లక్షల్లో దరఖాస్తులు రావడంత వల్ల ప్రారంభం రోజున ఇవ్వడం సాధ్యపడడం లేదన్నారు. అర్హులను గుర్తించేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఎప్పుడు ఇస్తామన్నది వచ్చే నెల (ఫిబ్రవరి)లో స్పష్టం చేస్తామన్నారు.రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నూరు శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని నిరుపేద, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉదాత్త ఉన్నతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యం అని తెలిపారు. వాస్తవానికి ఆదివారం రోజునే అర్హులైన వారందరికి ఇవ్వాలని అనుకున్నామన్నారు. కానీ కొత్తగా చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారని….కాబట్టి ఇవ్వలేక పోతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా భట్టి, పొంగులేటిలు తెలిపారు.