బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు పిలుపునిచ్చారు. పిప్పిరి లో జరగనున్న సీఎం సభ స్థలిని శుక్రవారం ఆయన మరో మంత్రి గడ్డం వివేక్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని అన్నారని ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. పిప్పిరి సభలో బోథ్ నియోజకవర్గానికి సంబదించిన పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్, బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్ , తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ,సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్,బోథ్ నియోజకవర్గం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల,పొచ్చేరలో ఐటీఐ కళాశాల ఏర్పాటు ప్రకటనను చేయనున్నారని తెలిపారు. బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు, 2027 గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అనేక అభివృద్ధి కార్యక్రమలకు శంఖు స్థాపన చేయ బోతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నలు మూలల నుండి ప్రజలు ఈ సభ కు తరలి వచ్చి సభను విజయవంతం చెయాలనీ మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు