Take a fresh look at your lifestyle.

“మంచి రోడ్లు – అభివృద్ధికి చిహ్నాలు”నినాదం తో ముందుకెళ్లాలి

  • ర్షాకాలం సీజన్ లో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
  • జిల్లా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలి.
  • పెండింగ్ రోడ్డు ప్యాచ్ వర్క్ లు వెంటనే పూర్తి చేయాలి.
  • వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు,ఆర్వోబి,ఆర్ యుబి లను పరిశీలించాలి.
  • నిర్మాణ పనులపై వారంలోపు పూర్తి నివేదిక చేయాలి.
  • కేజీ వీల్స్ ట్రాక్టర్స్ రోడ్ల పై తిరిగేటప్పుడు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.
  • అధికారులకు రాష్ట్ర ఆర్​అండ్​ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి దిశానిర్దేశం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోడ్డు భవనాల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.”మంచి రోడ్లు-అభివృద్ధికి చిహ్నాలు” నినాదం తో ముందుకెళ్లాలనీ..జిల్లా కేంద్రం నుండి గ్రామ స్థాయి వరకు పంచాయతీ రాజ్,రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సూచించారు.గత అనుభవాల దృష్ట్యా ఈ సారి అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి ఇంజనీర్ల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాలు,వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీ కి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వరదల వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు వెంటనే రీ స్టోర్ చేసేందుకు వీలుగా సాండ్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్ ఏ.ఈ స్థాయిలో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉదృతంగా ప్రవహించే నదులు వాగులు వద్ద బ్రిడ్జిలు, కల్వర్టులు పై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ సెంటర్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని సూచించారు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఆర్అండ్ బి శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూడ్చేందుకు ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్ లపై అధికారులను ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బి స్టేట్ రోడ్స్ కు సంబంధించి మొత్తం 1214 గుంతలు ఏర్పడి 2488 కి.మీ రోడ్డు పాక్షికంగా దెబ్బతిందని, 2186 కి.మీ రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని,ఇంకా 302 కి.మీ రోడ్డు మరమ్మత్తు ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.మిగిలిన రోడ్ల ప్యాచ్ వర్క్ లు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అట్లాగే వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు,ఆర్వోబి,ఆర్ యుబి ల ను పరిశీలించి.. నాణ్యత, పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. నిరంతర రాకపోకలు ఉండే నదులు,వాగుల మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు,రోడ్ల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి ప్రోగ్రెస్ తో పాటు వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర రహదారులున్న గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ ట్రాక్టర్స్ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రోడ్ల పై తిరిగితే రోడ్లు దెబ్బతింటాయననారు.ఇప్పుడు పంటల సాగు సీజన్ కాబట్టి కేజీ వీల్స్ ట్రాక్టర్స్ రోడ్ల పై తిరుగేటప్పుడు జాగ్రత్తలు పాటించేలా,కేజీ వీల్స్ ట్రాక్టర్ యజమానులకు,రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.