- సీఎం రేవంత్ రెడ్డి.
- బ్రహ్మోస్ మిస్సైల్ ప్రతినిధి బృందంతో సీఎం భేటీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతాలని వెల్లడించారు. బ్రహ్మోస్ మిస్సైల్ ప్రతినిధి బృందం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీఎం.. ఆ ప్రతినిధి బృందానికి స్వాగతం తెలిపారు. దేశంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని ఆ ప్రతినిధి బృందానికి వివరించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం తెలంగాణ, హైదరాబాద్‌ను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వం తరుపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సీఎం విజ్ఞప్తిపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ, సీఈఓ డాక్టర్ జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్‌డీఎల్ జీఏ శ్రీనివాస మూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.
