Take a fresh look at your lifestyle.

మాటల మాంత్రికుడు కేసీఆర్

  • 20 లక్షల మంది సొంత ఇంటి కల నెరవేర్చుతం.
  • ఆగస్టు 15 లోపు భూ సమస్యలు పరిష్కారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
  • కెసిఆర్ పాలనకు నిదర్శనం వాసాలమర్రి.
  • ఫామ్ హౌస్ గీతలతో కాలేశ్వరం కుంగింది.
  • ఆలేరు ప్రజలు మంచి నాయకున్ని గెలిపించుకున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
  • కేసీఆర్ అగవ్వను ఆగం చేసి పాపం మూటగట్టుకుండు.
  • మూఢనమ్మకాల పిచ్చోడు కేసీఆర్.
  • కెసిఆర్ గాయాలు చేస్తే రేవంత్ ఆయింట్మెంట్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.

తుర్కపల్లి ముద్ర : పనిచేయడం చేతకాని మాటల మాంత్రికుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో అర్హులైన 227 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. రాష్ట్రానికే వాసాలమర్రి గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని నమ్మించి, ఉన్న ఇళ్లను కూలగొట్టి సర్వనాశనం చేశాడని తెలిపారు. తన స్వార్థం కోసం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని తన ఫామ్ హౌస్ నుండి యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసుకోవడం తప్ప మరి ఏ అభివృద్ధి చేయలేదన్నారు. 450 ఇళ్లను కట్టిస్తానని హామీ ఇచ్చి, నాలుగు యేండ్లలో నాలుగు ఇండ్లను కూడా కట్టించిన పాపాన పోలేదన్నారు. అప్పు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతగాని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. పేదవాడు అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదని రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వార పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు డైట్ చార్జీలను 40 శాతం, ఆడపిల్లలకు 200% కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. పదేళ్ల పాలనలో ఏ ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయని అసమర్థ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. 24 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని, 22,500 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదటి దశగా మంజూరు చేశామని, 4 ఏళ్లలో 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించి వారి సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ దేయమని తెలిపారు. ధరణితో పేదవాడు ఇబ్బంది పడుతుంటే భూ భారతి చట్టం 2025 తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించేందుకు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ గ్రామాలలోని రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశామని, ఆగస్టు 15 లోపు భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సర్వే వ్యవస్థను పటిష్టం చేయడం కొరకు రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను మీ మండలాలకు నియమించబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మా అందరిదని హామీ ఇచ్చారు. పచ్చి అబద్ధాలతో మళ్ళీ మోసం చేయాలని తాపత్రయ పడుతున్న కెసిఆర్ కు ప్రజలు మరల తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

కెసిఆర్ ఓ మూఢనమ్మకాల పిచ్చోడని, ఫామ్ హౌస్ నుండి యాదగిరిగుట్టకు వెళుతుంటే స్మశానం అడ్డుగా ఉందని, ఆ అడ్డు తొలగించుకునేందుకు వాసాలమర్రి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నాడని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నమ్మించి ఉన్న ఇండ్లను, బడిని కూలగొట్టి నాలుగు లైన్ల రోడ్డు వేసుకున్నాడు తప్ప ఏ ఒక్క పని కూడా చేయలేదని తెలిపారు.తిరుమలాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసాలమర్రి గ్రామాన్ని ఆదుకుంటానని చెప్పిన 15 రోజులలోనే 227 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ గాయాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆయింట్మెంట్ పెడుతున్నాడని అన్నారు.ఇది మాటల ప్రభుత్వం కాదని, ఇది చేతల ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూ భారతీని రైతులకు చుట్టాన్ని చేసి, కెసిఆర్ గుండెల్లో గుణపాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దించాడని కొనియాడారు. ఇంట్లోకి అల్లుడు బిడ్డే వస్తే ఇబ్బందిగా ఉంటుందని అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తానని, ఆకిట్లలో పండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చుతోందని తెలిపారు. విద్యార్థులను, అమరవీరులను రైతులను, మహిళలను ఆఖరికి ముసలమ్మ ఆకుల ఆగవ్వను కూడా మోసం చేసి పాపాన్ని మూటగట్టుకున్నాడని అన్నారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్ల మెక్కి అప్పుల కుప్పగా రాష్ట్రన్ని మార్చారని మండిపడ్డారు. డబ్బుల కోసమే గుట్టను కట్టిండ్రు తప్ప అభివృద్ధి కోసం కాదని విమర్శించారు. మెడికల్ కాలేజ్ మేమే తెచ్చాము, రిజర్వాయర్ మేమే తెచ్చామని చెప్పడమే తప్ప ఏ ఒక్క పని అయినా ప్రారంభించార అని ప్రశ్నించారు. పత్రాలకు పరిమితం కేసీఆర్,పనుల చేయడంలో నెంబర్వన్ రేవంత్ రెడ్డెనని అన్నారు.గంధ మల్ల రిజర్వాయర్కు రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మెడికల్ కాలేజ్ ని, ఇంటిగ్రేట్ స్కూల్ ను నిర్మించి తీరుతామని తెలిపారు.

ఆలేరు ప్రజలు మంచి నాయకున్ని గెలిపించుకున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ చేతగాని పాలనకు వాసాలమర్రి గ్రామమే నిదర్శనమన్నారు. 450 ఇళ్లను కట్టిస్తే కమిషన్ రాదని కట్టించలేదని తెలిపారు. 800 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కమిషన్ వచ్చే పనులు చేశాడు కానీ ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క మంచి పని కూడా కేసీఆర్ చేయలేదని పేర్కొన్నారు.ఫామ్ హౌస్ పరిపాలన,ఫామ్ హౌస్ లో గీతలు గీయడంతోనే కాలేశ్వరం కుంగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనుకున్న పనులన్నీ సమయానికి చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా చేసి తీరుతుందని అన్నారు. పేదల కోసం మాత్రమే పథకాలను అందించాలని, నాలుగు నెలల్లో ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతు భరోసా ప్రతి ఒక్కరికి అందుతుందని, రానివారు అధికారులను సంప్రదించాలని అన్నారు. అధికారులను అడిగి చేపించుకోవడం మన బాధ్యత అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.