పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుకూలంగా మలుచుకుంది
దానం కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా పోటీ చేసినా స్సీకర్ కు తెలియదట
దానంకు క్లీన్ చిట్ ను సమర్ధిస్తారా..? చర్యలకు ఆదేశిస్తారా..?
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ నేతలు అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన బీ ఫాంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఇది ఊహాగానమో, వదంతో కాదన్న ఆయన ప్రజా రికార్డుల్లో ఉన్న నిజం అన్నారు. అయినా దానం పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని శాసనసభ స్పీకర్ చెప్పడం ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ బీ ఫాంపై ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ద్రోహానికి ఆధారం కాకపోతే, పదో షెడ్యూల్ ప్రకారం ద్రోహానికి ఆధారం అంటే అర్థం ఏంటో దేశం మొత్తం తెలుసుకోవాల్సిన ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే విధానం? దేశానికి మీరు బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని నిలదీశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‍కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్ధిస్తారా? లేక చర్యలకు ఆదేశిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి.. రాజ్యాంగాన్ని చేతబట్టి దేశవ్యాప్తంగా నీతిసూత్రాలు చెప్పిన మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే ఇదేనా? రాజ్యాంగ నైతికత ఇదేనా అని ప్రశ్నించారు. ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికైన ఎమ్మెల్యే, మరో పార్టీ జెండా కింద ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా కొనసాగితే రాజ్యాంగ ఆత్మ కేవలం రాజకీయ నినాదంగా మారిపోతుందన్నారు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పి, తెలంగాణలో దాన్ని బలహీనపరచడం ఎలా సమర్థించగలరు? అని నిలదీశారు. దీంతో విప్ మార్పిడి చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం, స్పీకర్‌కు మీరు సూచిస్తారా? లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడటం రాజకీయ ప్రయోజనం ఉన్నప్పుడేనా అని దేశం భావించాలో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు, అలాగే దేశ ప్రజలు నిజాయితీగల సమాధానాన్ని ఆశిస్తున్నారని రాజ్యాంగాన్ని కేవలం ప్రసంగాలతో కాపాడలేమన్నారు.