ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలో వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఫుడ్ కమిటీ లో సభ్యులుగా ఉన్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ వారికి అందిస్తున్న భోజనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల ముడిసరుకుల గడువు వివరాలు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల గడువు తేదీ రిజిస్టర్లలో తప్పనిసరి నమోదు చేసి, ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారికి అందుతున్న విద్య గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న, డిటిడిఓ అంబాజీ, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, గ్రామ సర్పంచ్ మల్లేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.