ముద్ర, శేరిలింగంపల్లి:
మే 18వ తేదిన జరిగే తెలంగాణ లా సెట్ పరీక్షకు సిద్దమయ్యే అభ్యర్థుల కోసం ఈ నెల 11వ తేదిన టి-సాట్ ప్రత్యేక అవగాహన లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు నిపుణ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో లా సెట్ తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి సలహాలు-సూచనలు అందిస్తారన్నారు. లా సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ తమ సందేహాలను లైవ్ కార్యక్రమం ద్వార పరిష్కరించుకోవచ్చన్నారు. 12వ తేది నుండి ప్రత్యేక ప్రసారాలు మే 18వ తేదిన నిర్వహించబడే లా సెట్ పరీక్ష కోసం తెలంగాణ యువతను సిద్దం చేసేందుకు 11వ తేదిన లైవ్ కార్యక్రమం అనంతరం ఈ నెల 12వ తేది నుండి ప్రత్యేక డిజిటల్ ప్రసారాలు కొనసాగించనున్నట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.12వ తేది ఫిబ్రవరి నుండి మే 12వ తేది వరకు 90 రోజులు పాటు రోజుకు రెండు పాఠ్యాంశ భాగాల చొప్పున 180 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నామని, ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు టి-సాట్ విద్య ఛానల్, సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు నిపుణలో పున: ప్రసారం కానున్నాయని సీఈవో వివరించారు. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటి, కరెంట్ అఫైర్స్ అండ్ అప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ అఫ్ ద లా సబ్జెక్టులపై ప్రత్యేక ప్రసారాలుంటాయని, టి-సాట్ ప్రసారం చేసే డిజిటల్ పాఠ్యంశాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.