- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి వినియోగంపై రాష్ట్ర సర్కార్ దృష్టి.
- నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల భేటీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఈ రంగంలో ఏఐ “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” వినియోగంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం నెదర్లాండ్ కంపెనీ ఏఆర్ఐక్యూటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఇందులో కీలక చర్చలు జరిపారు.ఈ సందర్భంగా తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని తీసుకొస్తామని నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి తుమ్మల సైతం సానుకూలంగా స్పందించారు. కాగా ఏఐ (కృత్రిమ మేధస్సు) వాడకం వ్యవసాయ రంగంలో సమస్యలకు పలు రకాల మార్గాలను సూచిస్తోందని, పంట దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.