బోడుప్పల్, ముద్ర: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబిక శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనం కలిగించారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది
సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది మాత. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది గాయత్రీ తల్లి. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ రూపంలోని మాతను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది
అమ్మను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి, తద్వార బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. నిమిషాంబికా మాతను పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవిగా అలంకరించారు ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, ఇతర అర్చకులు. గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరించారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం, గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
కార్యక్రమంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.