Take a fresh look at your lifestyle.

నవజాత శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి :
తల్లి పాలు మాత్రమే శిశువులకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, కాబట్టి నవజాత శిశువులకు మొదటి రెండేళ్ల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం నర్సింగాయిపల్లిలోని మదర్ & చైల్డ్ హాస్పిటల్‌ (ఎంసీహెచ్) లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా “సురక్షిత మాతృత్వ దినోత్సవం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై గర్భిణీలకు, తల్లులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అప్పుడే పుట్టిన శిశువులకు మొదటి ఆరు నెలలు నుంచి రెండేళ్ల వరకు పూర్తిగా తల్లి పాలను ఇవ్వాలని, అది శిశువు ఆరోగ్యానికి అత్యంత అవసరమని తెలిపారు. తల్లి పాలు శిశువుకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. బిడ్డకు తల్లిపాల ప్రాధాన్యత విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే గర్భధారణ సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. రక్తహీనత ఉన్న గర్భిణీలు మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలు గర్భంతో ఉన్న సమయంలో కల్లు తాగడం వంటివి పూర్తిగా దూరం పెట్టాలన్నారు. ప్రస వానంతరం తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సురక్షితం 

ప్రస్తుతం వనపర్తి లోని ఎం సి హెచ్ హాస్పిటల్ లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, వాటిని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం ఎంతో సురక్షితమని సూచించారు. వనపర్తి లోని ఎం సి హెచ్ ఆస్పత్రిలోని డాక్టర్లు ఎంతో అంకితభావంతో నైపుణ్యంతో ప్రసవాలు చేస్తున్నారని ప్రశంసించారు. వనపర్తి ఎం సి హెచ్ లో నెలకు సగటున 450 నుంచి 490 సుఖ ప్రసవాలు చేస్తున్న సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. గత ఏడాది కాలంలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపతృల్లో 5529 ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వైద్యులను అభినందించారు. వాటిలో ఎక్కువ శాతం సాధారణ కాన్పులు ఉండటం సిబ్బంది అంకితభావానికి నిదర్శనం అని కొనియాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందడం జరిగిందని ప్రశంసించారు.

న్యూట్రిషన్ కిట్ల అందజేత

ఈ సందర్భంగా కలెక్టర్ సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన గర్భిణీలకు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. పోషకాహారం ద్వారానే తల్లికి బిడ్డకు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపర్డెంట్ అరుణకుమారి, ఆర్ఎంవో రెడ్డి కుమారి, డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీనివాసులు, గర్భిణీ స్త్రీల విభాగం నిపుణులు కిరణ్మయి, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.