Take a fresh look at your lifestyle.

నీటి బిందువు జల సింధువును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

  • సింగరేణిలో వ్యాప్తంగా నీటి బిందువు – జలసింధువు ముమ్మరం
  • 102 చెరువుల నిర్మాణం, పూడిక తొలగింపు
  • ఇప్పటికే 20 శాతం చెరువుల నిర్మాణాలు పూర్తి
  • కనీస చెరువు వైశాల్యం ఒక హెక్టారు ఉండేలా చర్యలు
  • సమీక్ష సమావేశంలో సంస్థ సీఎండీ బలరామ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా సింగరేణి పరిధిలో నీటి బిందువు జల సింధువు.. పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ సంస్ధ సీఎండీ బలరామ్​ అన్ని ఏరియాల జనరల్​ మెనేజర్లను ఆదేశించారు.ఈ నెల ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం వేగవంతంగా సాగుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేవారు. వచ్చే నెల 15 నాటికి సింగరేణి వ్యాప్తంగా మొత్తం 12 ఏరియాల్లో 62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడిక తొలగింపు పూర్తి చేయాలని బలరామ్ ఆదేశించారు.హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అన్ని ఏరియాల జీఎంలకు, సంబంధిత పర్యావరణ, సివిల్ శాఖల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి 20 శాతం పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు. పనులను మరింత వేగిర పరుస్తూ వచ్చే నెల 15 నాటికి మొత్తం చెరువుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.రానున్న వర్షాకాలంలో సింగరేణి నిర్మించిన ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా చేరే విధంగా సివిల్ పనులు పూర్తి చేయాలన్నారు. రక్షణ చర్యలుగా మినీ చెరువుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. సింగరేణి సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడం కోసం తీసుకున్న ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రతి ఏరియా జీఎం ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు.తొలుత 50 మినీ చెరువులు నిర్మించాలని భావించినప్పటికీ, గనుల ప్రాంతంలో ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకొని వీటి సంఖ్యను 62 కు పెంచామన్నారు.అలాగే ఇప్పటికే ఉన్న 40 చెరువుల్లో నీటి సామర్థ్యం పెంపుదలకు పూడిక తొలగింపు పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.సింగరేణిలో గతంలో కేవలం అక్కడక్కడ చెరువుల పూడికను కొన్ని ఏరియాలో తీసిన దాఖలాలు ఉన్నాయన్నారు.కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున చెరువుల నిర్మాణాన్ని చేపట్టడం గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఈ చెరువుల నిర్మాణం సింగరేణి సమీప ప్రాంత భూగర్భ జలాల పెంపుదలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.ఏరియాల వారీగా సింగరేణి కొత్తగా చేపడుతున్న 62 మినీ చెరువుల వివరాలు.మందమర్రి లో 10 మినీ చెరువులు, కొత్తగూడెంలో 8, భూపాలపల్లిలో, రామగుండం-1లో, రామగుండం-2లో, ఇల్లందు, మణుగూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఏరియాకు 5 మినీ చెరువుల చొప్పున, రామగుండం-3 ఏరియాలో 4 మినీ చెరువులను సింగరేణి యాజమాన్యం నిర్మిస్తోంది.ఈ సమీక్షలో కొత్తగూడెం కార్పోరేట్ నుండి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, పా కొప్పుల వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కార్యాలయం నుంచి సింగరేణి అటవీ శాఖ అడ్వైజర్ మోహన్ పరిగిన్, పర్యావరణ శాఖ జనరల్ మేనేజర్ సైదులు, ఏరియాల నుండి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, పర్యావరణ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.