- మంగ్లీ పార్టీలో డ్రగ్స్.
- సింగర్ బర్త్ డే పార్టీ వివాదం.
- 50 మంది వరకు హాజరు.
- రాత్రి 2 గంటల సమయంలో పోలీసుల దాడి.
- పార్టీలో పాల్గొన్న వారిలో 9 మందికి డ్రగ్ పాజిటివ్ గా ప్రచారం.
- రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్కరికే పాజిటివ్ అంటూ పోలీసుల వెల్లడి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి ఆమె బర్త్‌డే సందర్భంగా చేవెళ్ల శివారు ఈర్లపల్లి వద్ద త్రిపుర రిసార్టులో సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న 48 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘావత్ స్నేహితుడు దామోదర్ రెడ్డి ఉన్నారు. ఈ పార్టీలో త్రిపు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ కూడా ఉన్నారు.విదేశీ మద్యం, గంజాయి లభ్యమవడంతో సింగర్ మంగ్లీ, రిసార్ట్ నిర్వాహకులపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో ఈ పార్టీ జరిగింది. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
- పోలీసుల రిమాండ్‌రిపోర్ట్.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేశామని, అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. మంగళవారం అంటే జూన్ 10వ తేదీ అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్‌పై తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.రిసార్ట్‌లో పెద్దఎత్తున డీజే సౌండ్స్ పెట్టి హంగామా చేస్తున్నారని కంట్రోల్ రూమ్‌కి స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్‌కి మహిళా ఎస్సై వెళ్లారని చెప్పారు. అక్కడ పది మంది మహిళలతో పాటు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు.వాళ్లంతా మద్యం మత్తులో డాన్సులు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడే ఉన్న మేనేజర్ తెలిపారని చెప్పారు. అయితే ఆమె బర్త్‌డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ స్పష్టం చేశారని వివరించారు. ఇక మంగ్లీ బర్త్ డే పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అలాగే ఎక్సైజ్ అధికారుల నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని ఈ సందర్బంగా గుర్తించామన్నారు. ఆ క్రమంలో బర్త్ డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించామని చెప్పారు. బర్త్‌డే పార్టీకి, లిక్కర్ వినియోగానికి, డీజేకి అనుమతి లేదని మంగ్లీ స్పష్టం చేశారని పోలీసులు వివరించారు. డీజే ఈవెంట్ మేనేజర్ గా మేఘరాజు పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు.మరోవైపు పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామని పోలీసులు తెలిపారు.డ్రగ్ కిట్ ద్వారా అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. ఒక్కరికి మాత్రమే గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు ఈ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించామన్నారు.ఇక ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. పోలీసులు, ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. ఎలాంటి అనుమతులూ లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజర్ దామోదర్‌పై సైతం కేసు పెట్టామని ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్‌పైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.