ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
లక్ష్యాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 లోపు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వేసవిలో చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళిక, 99 రోజులపాటు నిర్వహించే ప్రజా పాలన ప్రగతి నివేదిక అంశాలపై హౌసింగ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 12863 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 8546 ఇండ్లు గ్రౌండింగ్ చేయబడ్డాయని, మంజూరు అయిన ప్రతి ఇల్లు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 621 గుడిసెలు ఉన్న గ్రామాలు ఉన్నాయని, వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రత్యేక కార్యాచరణకై నివేదికలు సమర్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికీ ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ఇండ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేసవిలో నీటి కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో గ్రామపంచాయతీ నిధులతో వివిధ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిపిఓ కు కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు ఓహెచ్ఆర్ ట్యాంకులను శుభ్రం చేస్తూ నాణ్యమైన త్రాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తలెత్తే గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా నిర్దేశించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సురేష్, హౌసింగ్ పీడీ సయ్యద్ మొక్రం బాబా తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.