ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారిణుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు, సిబ్బంది కోసం శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళా సిబ్బంది కోసం తాడు లాగుడు (టగ్ ఆఫ్ వార్) పోటీలు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. మహిళలు కుటుంబ వ్యవస్థను బలపరచడమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా విశేషంగా దోహదపడుతున్నారని చెప్పారు. నేటి కాలంలో మహిళలు విద్య, వైద్యం, పరిపాలన, రక్షణ, క్రీడలు, సాంకేతికత వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ధైర్యంగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రత కోసం విలువైన సేవలు అందిస్తున్నారని అన్నారు. చట్టం మరియు శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, విధుల్లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్ఓ, జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలి, వైద్య సిబ్బంది, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, ఆర్‌ఐ జగన్, సబ్ ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్, ఘౌస్ పాషా, రాజిత, రామదేవి, లలిత మరియు జిల్లా వ్యాప్తంగా మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.