Take a fresh look at your lifestyle.

పట్టణంలో అసలు పంచాయతీ కీలకమవుతున్న పురపోరు

పట్టణంలో అసలు పంచాయతీ
కీలకమవుతున్న పురపోరు
మూడు పార్టీలకూ ముచ్చెమటలు
కాంగ్రెస్ లో వివాదాల వ్యవహారం
కేటీఆర్ కు సోదరి పోరు
కాషాయంలో అర్బన్ లొల్లి
బీసీ రిజర్వేషన్లపైనే అసలు కథ
42 శాతం ఇస్తామని హామీలు
ఇప్పటికే అధికారికంగా 32 శాతం
10 శాతం అదనంగా ఇచ్చేనా..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర రాజకీయాల్లో పురపోరు కీలకంగా మారింది. పట్టణ ఓటర్ల నాడి ఎటువైపు ఉంటుందో తేలనున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలకు తోడు తమ పాలనలో సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ బల నిరూపణకు సిద్ధమవుతున్నది. ఇక, గ్రామాల్లో ఇంకా తమ ప్రాబల్యం పెంచుకోవాలని, పట్టణాల్లో మాత్రం తమదే ఆధిపత్యం అని కాషాయ దళం కాలరెగరేస్తున్నది. మూడు ప్రధాన పార్టీలు తమ పట్టుకోసం పట్టణ ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నాల్లో ఉంటే.. కొత్త పార్టీ పెడుతానంటూ ప్రకటించిన జాగృతి కవిత.. తాము ఓట్లు చీల్చుతామని, తమకు కూడా గెలుపు అవకాశాలున్నాయని, పార్టీ ఇంకా ఖరారు కాకపోవడంతో ఏదైనా గుర్తు మీద పోటీ చేసి తమ సత్తా చూపిస్తామంటూ అంచనా వేస్తున్నారు. తనను ఏ పార్టీ నుంచి బయటకు పంపించారో.. అదే పార్టీ ఓట్లను చీల్చి తన బలం చూపించుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఇవన్నీ రాజకీయపరమైన అంశాలైతే.. మూడు ప్రధాన పార్టీలకు మాత్రం రిజర్వేషన్ల భయం పట్టుకున్నది.

రాజకీయాల్లో కీలక ఘట్టం
రాష్ట్ర రాజకీయాల్లో పుర పోరు కీలక అంశాలను బయటకు తీసుకురానున్నది. కాంగ్రెస్ పాలన రెండేళ్లు పూర్తయిన నేపథ్యం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్న ఈ తరుణంలో జరగబోతున్న మునిసిపల్ ఎన్నికలు అటు అధికార కాంగ్రెస్ పార్టీకీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అత్యంత కీలకమే. కేసీఆర్ రాజకీయ వారసుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజకీయ భవితవ్యానికి, కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పోషించబోయే పాత్రకు ఈ మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయని స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో ఇప్పుడు 123 పురపాలికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఇందులో 117 మున్సిపాలిటీలకు అత్యంత త్వరగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

పొలిటికల్ ఫ్యూచర్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక విధంగా బీఆర్ఎస్ అనుకున్నంత ప్రభావాన్ని చూపించలేకపోయింది. అటు కాంగ్రెస్ కూడా తమదే ఆధిపత్యం అనే విధంగా నిరూపించుకోలేకపోయింది. బీజేపీ మాత్రం ఓ మూలన పడినట్లుగా మారిపోయింది. అయితే, పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకపోవడంతో.. గెలుపు ఖాతాలు పార్టీల ఇష్టమే అన్నట్టుగా మారిపోయాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి పెద్ద రాజకీయ పరీక్షగా ఈ మునిసిపల్ ఎన్నికలు నిలవనున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరుగుతాయి.

కేటీఆర్ కే సవాల్
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎవరికీ అనుకూలంగా కనిపించడం లేదు. అధికార కాంగ్రెస్ కూడా కొంత భయంగానే ఉంది. ఇలాంటి సమయంలో గులాబీ పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన బాధ్యత కేటీఆర్ పైనే ఉంది. పట్టణ ఓటర్లలో ఆ పార్టీ కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పైనే ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తిని క్యాష్ చేసుకునే సామర్థ్యం కేటీఆర్ కేడర్ బలోపేతం చేయాల్సి ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ గతంలో బలమైన పట్టు కలిగి ఉండేది. ఆ పట్టు ఇంకా కొనసాగుతోందా? లేక కాంగ్రెస్ వైపు మళ్లిందా? అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ప్రస్తుతం కేటీఆర్ వ్యూహాలు సరిగా రాజకీయంగా కలిసి వచ్చేలా లేవని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. అటు కీలక నేతల నుంచి సపోర్ట్ కూడా తక్కువే అన్నట్టుగా ఉంది. కేవలం సోషల్ మీడియా ఆధారంగానే బీఆర్ఎస్ కొంత లాక్కుంటూ వస్తోంది.

కవితతో గండమేనా..?
ఈ పుర పోరులో కేసీఆర్ కుమార్తె కవిత కీలకంగా మారనున్నదా.. అంటే కొంత మేరకు అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మహిళా ఓటర్లపై కవిత ప్రభావం ఉండొచ్చని వారి అంచనా. పట్టణ మహిళా సమస్యలపై ఆమెకు ఉన్న గుర్తింపు, బీఆర్ఎస్ లో కొత్త రాజకీయ దిశను సూచించే ముఖచిత్రంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకంగా మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పట్టణ మహిళా ఉద్యోగులపై కవిత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీనికితోడు బీఆర్ఎస్ లోకి ఓ వర్గం కవితకు కలిసి వస్తుందనే టాక్ కూడా ఉంది. మహిళా భద్రత, మహిళల ఉపాధి అవకాశాలు, పట్టణాల్లో పెరుగుతున్న ధరలు, అధికమవుతోన్న జీవన వ్యయం, మహిళలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, మహిళా దృక్పథంతో రాజకీయాలను చూడాలన్న అంశాన్ని కవిత ప్రధానంగా ముందుకు తెచ్చే అవకాశముంది. దీంతో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత వ్యూహం కాస్త భిన్నంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘చేతి’కి చిక్కేనా..?
అధికార కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు సవాల్ గానే కనిపిస్తున్నాయి. పాత, కొత్త నాయకుల మధ్యనే విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇవన్నీ బహిరంగమవుతూనే ఉన్నాయి. ఇటు మంత్రుల మధ్య విబేదాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మున్సిపాలిటీల్లో గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అట్టిపెట్టుకొని ఉన్న నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు తమకు హామీ మీదనే వచ్చామని.. కాబట్టి తమకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులకు ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది.
ఇవే కాకుండా కొన్ని కీలకమైన హామీలు ఇంకా నెరవేరలేదు. దీంతో ఎక్కడ ఇవి తమకు మైనస్ గా ఉంటాయనే భయం కూడా నెలకొంది. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలిచ్చారు. కానీ, అక్కడ సయోధ్య చేయడమే ఇప్పుడు మంత్రులకు ఉన్న అతి పెద్ద టాస్క్.

కలవరం తప్పని కమలం
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయ దళం కానరాకుండా పోయింది. చాలాచోట్ల అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి సమయంలో ఈ పుర ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అర్బన్ లో తమకు తిరుగులేని పట్టు ఉందని చెప్పుకునే కమలం లీడర్లు.. క్షేత్రస్థాయిలో ఆ మాటను నిజం చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జెండా ఎగరేయడం కమలం నేతలకు అగ్నిపరీక్షగా మారింది. ఈ ఫలితాలు రాబోయే జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో.. పార్టీ హైకమాండ్ ఈ పోరును సీరియస్‌‌‌‌గా తీసుకుంది. బీజేపీకి మొదటి నుంచి ‘అర్బన్ పార్టీ’ అనే ముద్ర ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టౌన్లలో తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోకపోతే, అది బీజేపీ గ్రాఫ్‌‌‌‌ పడిపోవడానికి సంకేతంగా మారుతుందని వాదనలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కేడర్‌‌‌‌ను లీడర్లు సమాయత్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లు బీజేపీకి కీలకంగా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్​లో బీజేపీకి మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. ప్రస్తుతం ఈ బల్దియాను గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌‌‌‌పాల్ సూర్యనారాయణ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న చోట కార్పొరేషన్ చేజారితే అది పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. మరోపక్క ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరులో సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. ఈ మూడు చోట్ల మేయర్ పీఠమే లక్ష్యంగా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంచిర్యాల, రామగుండంలో అంతో ఇంతో ప్రభావం చూపినా.. కొత్తగూడెంలో అంతంత మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది.

రిజర్వేషన్ల పరేషాన్..?
రాజకీయంగా ఈ పరిస్థితి ఉంటే.. రిజర్వేషన్లు మరో కీలక అంశంగా పార్టీలకు మారింది. ఎందుకంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీని పెట్టిన అసెంబ్లీ తీర్మానానికి మూడు పార్టీలూ ఆమోదం చెప్పాయి. ఒకడుగు ముందుకేసిన కాంగ్రెస్.. అధికారికంగా వీలుకాకుంటే పార్టీపరంగా 42 శాతం అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా తామూ సిద్ధమే అనే సంకేతాలిచ్చాయి. ఫలితంగా ఇప్పుడు పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లెక్క చూపించాల్సిందే. అయితే, ఈసారి జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు దక్కాయి. పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం ఇంకో 10 శాతం ఇవ్వాల్సిందే. చాలాచోట్ల ఉన్నత వర్గాలు ఆశలు పెట్టుకున్న సీట్లన్నీ ఇప్పుడు బీసీ కోటాలోకి వెళ్లాయి. ఇంకా 10 శాతం బీసీలకు పార్టీపరంగా కేటాయిస్తే.. మరో 10 సీట్లు వదులుకోవాల్సిందే. జనరల్ స్థానాల్లో బీసీలను బరిలోకి దింపాల్సిందే. దీంతో మూడు పార్టీల్లోనూ విభేదాలు మొదలయ్యాయి. ఇటు అదనంగా 10 శాతం బీసీలకు ఇవ్వకుంటే వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా రాజకీయ పార్టీలకు ఇటు రాజకీయ పరిస్థితులు, సవాళ్లు, సత్తా మాత్రమే కాదు.. రిజర్వేషన్ల గండం కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.