గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనర్హులకు ప్రశంసలు
ముఖ్య అతిథుల చేతుల మీదుగా కొంతమంది అనర్హులకు ప్రశంస పత్రాలు?
ముద్ర, నారాయణపేట ప్రతినిధి:
వైద్య ఆరోగ్యశాఖలో నేడు గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇచ్చే ప్రశంసలు, పురస్కారాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిరంతరం సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని పక్కనపెట్టి, కొందరికే ప్రత్యేకంగా ప్రశంసలు దక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశంసలకు తీసుకున్న ప్రమాణాలు ఏమిటన్నది స్పష్టత లేకపోవడం వల్ల శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజమైన సేవలకు గుర్తింపు ఇవ్వకపోతే ఉద్యోగుల్లో నిరుత్సాహం పెరుగుతుందని, స్పష్టమైన ప్రమాణాలతోనే ప్రశంసలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న వ్యవహారాలు ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. జిల్లా పరిధిలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ వైద్యులు అనధికారిక వ్యక్తితో కలిసి వైద్య సేవలు అందిస్తున్నట్లు గతంలో పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ మొత్తం వ్యవహారానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక కింది స్థాయి అధికారి అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయనే చక్రం తిప్పి సంబంధిత వైద్యుల పై చర్యలు లేకుండా మేనేజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో మక్తల్ ప్రాంతానికి చెందిన మరో వైద్యులు విధులకు గైర్హాజరయ్యాడన్న కారణంతో ఒక్కరోజు జీతం నిలిపివేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివాదాలకు కేంద్రంగా ఉన్న ఆ వైద్యుడిని ప్రశంస పత్రానికి ఎంపిక చేయడంలోనూ అదే అధికారి కీలక పాత్ర పోషించాడన్న సమాచారం కలకలం రేపుతోంది. మరింత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్‌సీడీ సేవలు సైతం బలహీనంగానే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వైద్య వర్గాల్లో వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహారాలను నడిపిస్తున్నాడన్న భావన బలపడుతోంది. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైనా ఈ వ్యవహారంపై స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, వైద్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతింటుందని, ‘‘ఆడిందే ఆట, పాడిందే పాట’’ అన్నట్లుగా పరిస్థితి మారుతుందన్న సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వివాదాలకు గురైన వ్యక్తుల ఎంపికపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని, నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.జిల్లా స్థాయి అధికారులు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటే, వైద్య సిబ్బందిలో నమ్మకం పెరుగుతుందని, ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పలువురు సూచిస్తున్నారు.