ఇంటర్నెట్ ప్రోటోకాల్ డివైజ్ రికార్డ్స్ కోసం ఇంటర్నెట్ ప్రొవైడర్లతో సంప్రదింపులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు కీలక పరిణామం చోటు చేసుకున్నది.
ఇప్పటి వరకు అధికారులు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ను విచారించిన సిట్ అధికారులు.. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అధికారులు, రాజకీయ నాయకులు ఇచ్చిన సమాచారం… వెలుగుచూసిన అంశాలపై విచారణ ముమ్మరం చేయాలని సిట్ భావిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ కాల్స్ డేటాపై సిట్ బృందం ఫోకస్ పెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాట్సాప్ ద్వారా ఎవరెవరు ఎవరిని సంప్రదించారనే విషయంలో నిఘా పెట్టారనే కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సిట్ అధికారులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డివైజ్ రికార్డ్స్ కోసం ఇంటర్నెట్ ప్రొవైడర్లను సంప్రదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఆరొందల ఫోన్ నంబర్లకు సంబంధించిన వాట్సాప్ కాల్స్‌పై సిట్ నిఘా ఉంచినట్లు సమాచారం. ఇదంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే జరిగిందని సిట్ భావిస్తున్నది. దీంతో ప్రభాకర్‌రావు ఎంత మందితో మాట్లాడారు..? వారిలో రాజకీయ నేతలు ఎవరున్నారు..? అనే దానిపై సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీలావుంటే గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ తో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పాటు పలువురు ఉన్నతాధికారులు సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు సంకోచించారు. తమ ఫోన్లపై నిఘా ఉంచారనే కారణంతో తాము వాట్సాప్, ఫేస్ కాల్, సిగ్నల్ యాప్‍లలో సంభాషించుకోవాల్సి వస్తోందని పలువురు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. చాలా మంది సాధారణ ఫోన్ కాల్స్‌కు బదులు వాట్సాప్ వంటి యాప్స్ ద్వారా సమాచార మార్పిడి చేసుకుంటున్నారని గుర్తించి.. ఆ దిశగా కూడా గత ప్రభుత్వంలోని పాలకులు, అధికారులు నిఘా పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్ ఇవ్వనున్న ఈ ట్విస్ట్ తో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్ను విచారించిన సిట్ బృందం అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి పంపించేశారు. అయితే ఇంతకాలం అధికారులు, చోటా లీడర్ల వరకు పరిమితమైన సిట్ ఇప్పుడు ఏకంగా అగ్రనేతల జోలికి రావడంతో సిట్ కు.. తర్వాత టార్గెట్ ఎవరు అనేది బీఆర్ఎస్‍లో టెన్షన్‍గా మారింది. ఒకరి తర్వాత ఒకరిని పిలవడం వారిచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా దర్యాప్తును మరింత స్పీడ్‌తో ముందుకు తీసుకువెళ్తుండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. తాము ఎలాంటి తప్పు చేయకున్నా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే తప్పు చేయకుంటే భయమెందుకని అధికార కాంగ్రెస్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నది.