కేటీఆర్ విచారణే దీనికి నిదర్శనం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు, ఏఐసీసీకి మధ్య డీల్ కుదిరే వరకు విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో అందరి కొంపలు ముంచిన కేటీఆర్‌ను సాక్షిగా విచారణకు పిలిచిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఆయన విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతోందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్ లోని హకీంపేటలో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మీడియాతో మాట్లాడారు. సమర్థవంతమైన, నిజాయితీవంతులైన అధికారులు సిట్‌లో ఉన్నారని చెప్పారు. వారిని స్వేచ్ఛగా పని చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందని ఆరోపించారు. తాము చెప్పినట్లుగా విచారణ జరగాలని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. ఉద్యోగాలు భర్తీకి నోచుకోక నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి, కేంద్రం నిర్వహిస్తున్న ఉద్యోగాల భర్తీకి ఉన్న తేడాను గమనించాలని కోరారు. టీజీపీఎస్సీ అంటేనే లీకేజీలు, పైరవీలు, కోర్టు కేసులన్నారు. ఆందోళనలు, ధర్నాలతో ఏళ్ల తరబడి పరీక్షలు, నియామకాలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక్క పైరవీకి, అవినీతికి, లీకేజీలకు ఆస్కారం లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసినా చేయకపోయినా నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని బండి సంజయ్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దీంతో నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడుతూ పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.