ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కొండాపూర్ బై పాస్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 21 మందికి గాయాలయ్యాయి.

వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపల్లి నుండి ఆర్మూర్‌లో జరిగే పెళ్లికి 21 మందితో వెళ్తున్న బొలెరో మ్యాక్స్ ఐచర్ వాహనం కొండాపూర్ సమీపంలో టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్ లో వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో లక్ష్మణ్ (60), తులసీ దాస్ (38) మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు. మిగిలినవారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా వాహనంలో అధికంగా ప్రయాణికులు ఉండటం, వేసవి కాలం కావటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసు కున్నారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.