Take a fresh look at your lifestyle.

మూసీ సుందరీకరణకు ముందడుగు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించిన సర్కార్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
మూసీ నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టు చేపడుతున్న తెలంగాణ సర్కార్.. దానికి సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 50 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టింది. భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్.. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని పేర్కొంది. మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు భూసేకరణ కోసం.. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌‌డీసీఎల్) కీలక ప్రకటన చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. నిర్ణీత గడువులో తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఫేజ్ A1 కింద.. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 9.2 కిలోమీటర్ల మేర భూ సేకరణ చేయనున్నారు. ఫేజ్ A2 లో భాగంగా ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉన్న 11.8 కిలోమీటర్ల భూమిని సేకరించనున్నారు. హైదరాబాద్‌ జిల్లా గోల్కొండ మండలం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో ఉన్న భూముల సేకరణ కోసం తాజాగా ఎంఆర్‌‌డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగానే సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మార్కెట్ విలువ ఆధారంగా భూమిని ఇచ్చే యజమానులకు పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే వారి భూమి పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక అభ్యంతరాల కోసం గడువు ప్రకటించిన ప్రభుత్వం.. ఆలోగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆయా భూముల సర్వే నంబర్లు.. గ్రామాల వారీగా పూర్తి లిస్ట్‌ను విడుదల చేసింది.
భూ సేకరణ చట్టం-2013 నిబంధనల ప్రకారం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను చేపట్టనుంది. మొత్తం 4 జిల్లాల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ డెవలప్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధిలో.. 14 మండలాల్లోని మొత్తం 46 గ్రామాల్లో పలు దశల వారీగా మూసీ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

Leave A Reply

Your email address will not be published.