Take a fresh look at your lifestyle.

దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 

కాంగ్రెస్ పాలనలో దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం
కష్టకాలంలో దళితులు కాంగ్రెస్ కు అండగా నిలిచారు
ముద్ర, తెలంగాణ బ్యూరో : 
సుదీర్ఘ ఘన. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దళితవాదంతోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాలకు ఒకే రకమైన పాలన అందిస్తోన్న హస్తం.. పార్టీలోనూ సమన్యాయం పాటిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, సీ, మైనార్టీలకు అండగా హస్తం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రెడ్డికి సీఎం, బిసికి పీసీసీ అధ్యక్ష పదవి, దళితులకు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి, నాలుగు మంత్రి పదవులు కేవలం కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యం అన్నారు. 90 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గురువారం గాంధీభవన్ లో జరిగిన మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్ గా పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బరువైన బాధ్యతను నమ్మకంతో సీఎం తో కలిసి కవ్వంపల్లి సత్యనారాయణ పై పెట్టామని చెప్పారు. పీసీసీ బలోపేతం కావాలనే ఉద్దేశ్యం తో కవ్వంపల్లి కి పదవి ఇచ్చినట్లు వివరించారు. అధిష్టానం నమ్మకాన్ని కవ్వంపల్లి వమ్ము చేయరనే ధీమా పార్టీలో సీనియర్లందరికీ ఉందన్నారు.  రాబోయే ఎన్నికల్లో ఎస్సీ తరపున కవ్వంపల్లికి సూచించిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. దళితులు క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలిచారని చెప్పారు. అందుకే తమ పాలనలో దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 17 శాతం ఉన్న ఎస్సీలకు 5 ముఖ్యమైన స్థానాలు ఇచ్చామన్నారు. రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్  దళిత నాయకుడు రాజయ్యను అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పదవి నుంచి ఎలా తొలగించారో వివరించారు.
టిపిసిసి ఎస్సి విభాగం చైర్మన్ కవ్వం పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లేకుంటే తానూ ఎమ్మెల్యే గా లేనన్నారు. ఆయన ఆశీస్సులతోనే ఎస్సి విభాగం చైర్మన్ అయ్యాయన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఉంటే నలుగురికి రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. సమాజం పట్ల సామాజిక బాధ్యత, సృహ ఉందని సీఎం తనను ప్రోత్సహించారని చెప్పారు. 59 కులాల కు చెందిన ఎస్సిల ను ఏక తాటి పై తీసుకు వచ్చేలా బాధ్యతాయుతంగా పని చేస్తానని చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. దళితులు ఎటు వైపు ఉంటే అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ లో ప్రతి దళితుడు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి,ఎమ్మెల్యేలు వేముల వీరేశం,లక్ష్మీ కాంత్, యెన్నం శ్రీనివాస్, మేడిపల్లి సత్యం,నాగరాజు, వినోద్,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం,ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.